C B I పరిధి - విధులు (C B I range - functions)

భారతదేశంలో అత్యంత ప్రధానమైన దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ). అనేకానేక కీలక నేర పరిశోధనలో సిబిఐ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. జాతీయ ఆస్తులు దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది.  అవినీతిని అణచడానికి తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కృషిలో నిమగ్నమై సమున్నత వ్యవస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అమెరికాలో దీనికి సమాన స్థాయిలో ఉండే సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ).


సిబిఐ పుట్టు పూర్వోత్తరాలు

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దేశంలో నలుమూలల నుంచి వివిధ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ముడిసరుకు, వస్త్రాలు సరఫరా చేసే వారు. అధిక మొత్తంలో డబ్బు కూడా యుద్ధం కోసం అప్పటి బ్రిటిష్ సర్కార్ ఖర్చు పెట్టేది. ఈ డబ్బు కేటాయింపు, వినియోగం, సరుకుల సరఫరాల లో ఏవైనా అవకతవకలు ఏర్పడి, అవినీతి ఫలితంగా ఖజానాకు చిల్లు పడుతుందేమోనని భావించి,  ముందు జాగ్రత్త చర్యగా సకల వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి 1941 లో బ్రిటిష్ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎస్ పి ఈ)ను ఏర్పాటు చేసింది. దేశ విభజనకు ముందు లాహోర్ భారతదేశంలో భాగం. దాంతో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ ముఖ్య కార్యాలయాన్ని లాహోర్ లో ఏర్పరిచింది. రెండో ప్రపంచ యుద్ధ  సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం వార్ డిపార్ట్మెంట్/ యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి ఆ యుద్ధ మంత్రిత్వశాఖ కి అనుబంధ సంస్థగా స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ ఏర్పాటయింది.

స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్

బ్రిటిష్ ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగుల్లో అత్యధిక శాతం భారతీయులే. ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం  దేశ వ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, ఆఫీసుల నిర్మాణం జోరుగా చేపట్టింది. ప్రభుత్వ ఖజానా నుంచి సింహ భాగం వనరులను వీటికే కేటాయించేవారు. యుద్ధం ముగిశాక రైల్వే నిర్మాణ కాంట్రాక్టుల్లో అధికార దుర్వినియోగం, లంచగొండితనం, అవినీతిని దర్యాప్తు చేయడానికి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ పూనుకొంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత హోం శాఖ అనుబంధ సంస్థగా దీనిని మార్చారు. 
    స్వాతంత్రం తరువాత అప్పటి ఉప ప్రధాని సర్దార్ పటేల్ దేశ హోమ్ శాఖను చేపట్టారు. భారత ప్రభుత్వం లోని అన్ని మంత్రిత్వ శాఖల్లో అన్ని విభాగాల్లో ఉద్యోగులపై దర్యాప్తునకు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ పరిధి విస్తరించారు. అప్పటివరకు ఈ సంస్థ పరిధిలో లేని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తోడు దేశ పాలనలో ఐక్యమవ్వని రాచరిక రాష్ట్రాలకు కూడా విస్తరించారు.

సి.బి.ఐ

1963 ఏప్రిల్ లో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ పేరుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చారు. "పరిశ్రమ, నిష్పాక్షికత, సమగ్రత" అన్నదే సి.బి.ఐ నినాదం. దేశ వ్యాప్తంగా సంక్లిష్ట కేసులను విచారించి దేశంలోనే కీలక దర్యాప్తు సంస్థగా సి.బి.ఐ గుర్తింపు పొందింది. 

  శాఖలు: 

సిబిఐని అనేక శాఖలుగా విభజించారు.

అవినీతి ఇ నిరోధక విభాగం

💠 వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సిబ్బంది పై డేగ కన్ను వేసి లంచగొండితనం, అవినీతి చోటుచేసుకోకుండా కాపలా కాయడం.
💠 తమ విజిలెన్స్ ఆఫీసర్లను వివిధ ప్రభుత్వ శాఖలతో అనుసంధానిస్తూ, అవినీతికి సంబంధించి నిఘా, సమాచార సేకరణ.
💠 అవినీతిపై అందిన ఫిర్యాదుల పై విచారణ.
💠 రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు/ విభాగాలు తీవ్రమైన అక్రమాలకు పాల్పడితే దర్యాప్తు కోసం ఆ కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు సి.బి.ఐ కి అప్పగిస్తాయి.

స్పెషల్ క్రైమ్ డివిజన్

హత్యలు, దోపిడీలు, అంతర్గత భద్రత, గూఢచర్యం, విధ్వంసం, మత్తు పదార్థాలు, డ్రగ్స్, మాదక పదార్థాలు, మోసం, చట్ట ఉల్లంఘన, ఫోర్జరీ, వరకట్న మరణాలు, అనుమానాస్పద మరణాలు ఇతర నేరాలు, ఢిల్లీ  స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం కింద తెలియజేసిన ఇతర చట్టాల ప్రకారం సమగ్ర విచారణ, దర్యాప్తు చేపడుతుంది.

ఆర్థిక నేరాల విభాగం

ఆర్థిక నేరాలు, బ్యాంకు మోసాలు, అక్రమ నగదు బదిలీ, హవాలా, డబ్బుతో కూడిన అక్రమ వ్యాపార కార్యకలాపాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో జరిగే మోసాలు, అక్రమ వ్యవహారాలను దర్యాప్తు చేస్తుంది.

టెక్నికల్ అడ్వైజరీ యూనిట్

బ్యాంకింగ్, పన్ను, ఇంజనీరింగ్, విదేశీ వాణిజ్యం, విదేశీ మారకం విషయాల్లో నిపుణులతో కూడి ఉంటాయి ఈ సాంకేతిక సలహా కేంద్రాలు. బ్యాంకింగ్, పన్ను, ఇంజనీరింగ్, విదేశీ వాణిజ్యం, విదేశీ మారక విషయాల్లో విచారణ, దర్యాప్తు సి బి ఐ ఆధికారులు చేపడితే ఈ సాంకేతిక సలహా కేంద్రాలు వారికి ఆయా కేసుల్లో మార్గదర్శకత్వం, విషయ పరిజ్ఞానం, సహాయం అందిస్తాయి. సాంకేతిక సలహా యూనిట్లను నాలుగు వర్గాలుగా విభజించారు.
💠 బ్యాంకింగ్, కంపెనీ లా, బీమా రంగ విషయాల కోసం బ్యాంకింగ్ సలహా కేంద్రం
💠 సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విషయాల కోసం ఇంజనీరింగ్ సలహా కేంద్రం
💠 ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను విషయాల కోసం టాక్సెషన్ సలహా కేంద్రం
💠 విదేశీ వాణిజ్యం, విదేశీ మారకం విషయాల కోసం ఫారిన్ ట్రేడింగ్/ ఫారిన్ ఎక్స్చేంజ్ సలహా కేంద్రం

డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగాన్ని ప్రారంభించారు. వివిధ చట్టాల వ్యాఖ్యానాలకు సంబంధించి, చట్టబద్ధమైన నియమాలు, నిబంధనలు, సవరణలు వంటి అంశాలలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సలహా సహకారాలు అందిస్తుంది. సి.బి.ఐ విచారణలో కేసులకు సంబంధిత చట్టపరమైన సలహాలు ఇస్తుంది. గెజిట్ ప్రచురణ కోసం చట్టపరమైన విషయాలపై గమనికలు తయారుచేయడం వంటి అంశాలకు సంబంధించిన విషయాలను కూడా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిశీలిస్తుంది. 

పాలసీ డివిజన్

సంస్థ, విజిలెన్స్, రక్షణకు సంబంధించి అన్ని పాలసీలు, విధానాలు, ప్రక్రియను పరిశీలిస్తుంది. వివిధ మంత్రిత్వశాఖలతో సంబంధాలు, ప్రత్యుత్తరాలు, విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ కోసం ప్రత్యేక కార్యక్రమాల అమలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన అన్ని అంశాలతో పాలసీ డివిజన్ వ్యవహరిస్తుంది.

పరిపాలన విభాగం

సి.బి.ఐ అన్ని విభాగాల సిబ్బంది, స్థాపన, పరిపాలన, అన్ని విభాగాల అకౌంట్స్ లేదా ఆర్థిక సంబంధిత ఖాతాలు నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తుంది. ఐజి హోదాలో ఉన్న జాయింట్ డైరెక్టర్ ఈ విభాగానికి అధికారిగా ఉంటారు.

సాంకేతిక సమాచారం విభాగం 

సి.బి.ఐ అన్ని సాంకేతిక సమాచార అవసరాలను సిస్టమ్స్ డివిజన్ చూస్తుంది. పార్లమెంటులో ఉత్పన్నమయ్యే సి.బి.ఐ సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అవసరమైన డేటాను తయారు చేస్తుంది. సి బి ఐ లో నియామకాలు, అవార్డుల కోసం ఉత్తర్వులు తయారు చేస్తుంది. సి.బి.ఐ సమగ్ర కంప్యూటరీకరణ ప్రణాళికను కూడా పర్యవేక్షిస్తుంది. సి.బి.ఐ ముఖ్య కమాండ్ సెంటర్లైన స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ సెంటర్, నెట్ వర్క్ మానిటరింగ్ సెంటర్లు ఈ సాంకేతిక సమాచార విభాగ పర్యవేక్షణలో ఉంటాయి. 

కో  ఆర్డినేషన్ డివిజన్

💠 సమన్వయ విభాగం: వివిధ రాష్ట్రాల డీజీపీలు(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్), సిఐడి విభాగాలతో సమన్వయ, సహకారాలు, వివిధ పోలీస్ సంస్థల సదస్సులలో పాల్గొనడం సమన్వయ విభాగం చేస్తుంది. సి.బి.ఐ బులెటిన్ ప్రచురణ కూడా సమన్వయ విభాగం చేస్తుంది.
💠 ఇంటర్ పోల్ విభాగం:  
ఈ యూనిట్ నేషనల్ సెంట్రల్ బ్యూరో సెక్రటేరియట్ గా వ్యవహరిస్తోంది. ఇంటర్ పోల్ తో సంబంధాలు కలిగి ఉంటుంది. దాని సభ్య దేశాలతో అనుసంధానం అవుతుంది. విదేశాలలో విచారణకు, విదేశీయులపై జరిగే దర్యాప్తుకు సహాయం అందిస్తోంది. భారతదేశానికి సంబంధించిన కేసులపై, భారతీయులపై వచ్చే ఆరోపణలపై ఇంటర్ పోల్ సభ్య దేశాలతో ప్రత్యుత్తరాలు జరుపుతుంది. అదేవిధంగా భారతదేశంలో దర్యాప్తు కోసం ఇంటర్ పోల్ సభ్య దేశాల వినతులను స్వీకరిస్తుంది.

సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ

నేర పరిశోధనకు సంబంధించి వివిధ కోణాల్లో నిపుణుల అభిప్రాయాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ అందిస్తుంది. సీబీఐతో పాటు, ఢిల్లీ పోలీస్, కేంద్ర ప్రభుత్వం విభాగాలు, రాష్ట్రాలు, రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ లు, డిఫెన్స్ త్రివిధ దళాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు మొదలైన కేంద్ర ప్రభుత్వ  రంగ సంస్థలు వాటికి క్రిమినల్ కేసులలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం అందిస్తుంది. అదేవిధంగా గా ఇతర పోలీస్ ట్రైనింగ్ స్కూళ్లకి, విశ్వవిద్యాలయాల కి, అనేక ప్రభుత్వ విభాగాలు నిర్వహించే బోధన, శిక్షణ కార్యకలాపాల్లో కూడా సహకరిస్తుంది.

సైబర్ ఫోరెన్సిక్ లేబరేటరీ & డిజిటల్ ఇమేజింగ్ సెంటర్

సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ఆధ్వర్యం లో ఇవి పనిచేస్తాయి. ఎలక్ట్రానిక్ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ విశ్లేషణ లో అమలుకు ఈ రెండు సంస్థలు సహాయపడతాయి. హత్య లాంటి నేరాలు జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ దృశ్యాల తనిఖీ కోసం ఈ లేబరేటరీ సేవలు వినియోగించుకుంటారు. ఇక్కడి ఇ నిపుణులు కోర్టులో హాజరై వాంగ్మూలాలు, ధ్రువీకరణ, ఆధారాలు ప్రవేశపెడతారు.

ట్రైనింగ్ డివిజన్ లేదా శిక్షణ విభాగం

సిబిఐ అకాడమీ ఢిల్లీ వద్దనున్న ఘజియాబాద్ లో ఆరంభించారు. సిబిఐ అకాడమీ చాలా ఆధునిక పోలీసు శిక్షణా కేంద్రం. ఆధునిక నేర పరిశోధన కొరకు విజ్ఞానం, నైపుణ్యాలను కల్పిస్తుంది ఈ అకాడమీ. సిబిఐ లో కొత్తగా ఎంపికైన డిప్యూటీ సూపరింటెండెంట్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరికీ ఇక్కడ ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తారు. సిబిఐ, రాష్ట్ర పోలీసు అధికారులకు, వివిధ విభాగాల విజిలెన్స్ ఆఫీసర్లకు కూడా ప్రత్యేక విషయాలపై రిఫ్రెషర్ కోర్సులు అందిస్తారు.

సిబిఐ డైరెక్టర్

సిబిఐ కి సారథ్యం వహించే వ్యక్తిని "సిబిఐ డైరెక్టర్" గా వ్యవహరిస్తారు. ఈ పదవిలో నియమితులయ్యే వ్యక్తి ఐపిఎస్ ఆఫీసర్ ఆయి ఉండాలి. 
💠 ఈ వ్యక్తి హోదా, ర్యాంక్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐ జి) తో తో సమానంగా ఉంటుంది.
💠 సి.బి.ఐ డైరెక్టర్ ను కేవలం రెండేళ్ల కోసం మాత్రమే నియమిస్తారు.
💠 సి.బి.ఐ డైరెక్టర్ నియామకం కోసం 2003లో సి వి సి చట్టం చేశారు.
సి బి ఐ లో ఉన్న ఇతర ర్యాంకులు - ప్రత్యేక డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ సూూపరింటెండెంట్ ల కోసం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐ ఆర్ ఎస్) లేదా ఐపీఎస్ కేడర్ అధికారులను నియమిస్తారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, సీనియర్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ వంటి సిబ్బందిని స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా లేదా పోలీసు,  ఇన్్ కమ టాక్స్ విభాగాల నుంచి డిప్యుటేషన్ ద్వారా నియమిస్తారు.

ఎంపిక కమిటీ

2003లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నీ సవరించారు. సి.బి.ఐ డైరెక్టర్ నియామకం కోసం 2003లో సి వి సి చట్టం చేశారు. సి.బి.ఐ డైరెక్టర్ గా నియమించాలని భావిస్తున్న అభ్యర్థిని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (కేంద్ర నిఘా కమిషనర్) దర్యాప్తు చేసి సిఫార్సులు చేయాలి. సి.బి.ఐ డైరెక్టర్ నియామక ప్యానల్ కి సి. వి. సి. లేదా విజిలెన్స్ కమిషన్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ఇతర విజిలెన్స్ కమిషనర్ లు, హోం సెక్రటరీ, గ్రీవెన్స్ ఎస్ క్యాబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శి సభ్యులుగా ఉండేవారు. అయితే 2013లో సి.బి.ఐ డైరెక్టర్ నియామకం కోసం కొత్త చట్టం చేశారు.
💠 కొత్త చట్టం ప్రకారం సి.బి.ఐ డైరెక్టర్ నియమించడానికి ఒక సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి.
💠 ఈ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
     లోక్ సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులు. వీరి ఇ సమావేశానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరు కాలేని పక్షంలో మరోక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన తరపున పంపుతారు. లోక్ సభలో అధికారిక ప్రతిపక్ష నేత లేనప్పుడు అతిపెద్ద పార్టీ నాయకుడు సభ్యుడిగా ఉంటారు. సిఫారసులను చేస్తున్నప్పుడు పదవీ విరమణ పొందుతున్న సిబిఐ డైరెక్టర్ అభిప్రాయాలను కూడా సెర్చ్ కమిటీ పరిశీలిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

💠 సిబిఐ డైరెక్టర్ మీ ఎంపిక చేసే ప్రక్రియ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ లో మొదలవుతుంది.
💠 హోమ్ మంత్రిత్వ శాఖ ఐపీఎస్ అధికారుల జాబితాను సిద్ధం చేస్తుంది.
💠 ఈ జాబితా డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ విభాగానికి వెళుతుంది.
💠 స్క్రూటినీ చేసి సీనియారిటీ, సమగ్రత, అనుభవం ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేస్తుంది.
💠 ప్రధాని నేతృత్వంలో సెర్చ్ కమిటీ ఈ పేర్లను పరిశీలించి, నిర్ణయం తీసుకొని, సిబిఐ డైరెక్టర్ నియామకానికి ప్రభుత్వానికి సిఫార్సులను పంపుతుంది.
💠 సెర్చ్ కమిటీ నిర్ణయం ఏకగ్రీవంగా ఉంటుంది లేదా సభ్యులతో విభేదాల నోటు రికార్డు చేయగలదు.
     సి.బి.ఐ దర్యాప్తు సంస్థ అధికారాలు, పరిధి, విధులు, బాధ్యతల వంటి విషయాలు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 లో పొందుపరిచారు. ఈ చట్టం కింద, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ తో సిబిఐ దర్యాప్తు చేయవచ్చు. రాష్ట్రంలో లో చేయాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి ఉండాలి.



Comments

Post a Comment

Please do not enter any spam link in the comment box