మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన

   
     ముప్పయి ఏళ్ళ వ్యవధిలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలతో అపారమైన ప్రాణనష్టం జరిగింది. అంతేకాకుండా యూదు జాతిపై ఊచకోత,  అణుబాంబు దాడి, యుద్ధ ఖైదీలను క్రూరంగా హింసించడం, ఆఫ్రికా దేశాల నుంచి ప్రజలను బానిసలుగా ఎగుమతి చేయడం, మహిళలపై అరాచకాలు, పిల్లలను బానిసలుగా, బాల కార్మికులుగా ఉపయోగించడం, ఒక నిర్దిష్ట జాతి లేదా మతానికి చెందిన వారిని అల్పులుగా చూడడం, వర్ణ విచక్షణ వంటి విషయాలను ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేశాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న తరుణంలో ప్రపంచ అగ్ర దేశాల ప్రతినిధులు 1944లో వాషింగ్టన్ లోని జార్జిటౌన్ లో సమావేశమయ్యారు. ఇలాంటి చర్యలను అరికట్టకపోతే ప్రపంచ వినాశనం తప్పదని తీర్మానించారు. తత్ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఉద్భవించింది. అన్ని దేశాలు కలిసి హక్కుల ప్రాముఖ్యంపై చర్చించడానికి మార్గం సుగమమైంది.
    పురుషులు, స్త్రీలు, పెద్ద, చిన్న దేశాలన్న తారతమ్యం లేకుండా అందరు సమాన హక్కులు కలిగి ఉండాలని పునరుద్ఘాటించడానికి ఒక వేదిక అవసరమైంది. పౌర సంఘాలు, వివిధ దేశాలు ఐక్యరాజ్యసమితికి పలు విన్నపాలు చేసి మానవ హక్కుల కమిషన్ ఏర్పాటులో అవి సఫలీకృతమయ్యాయి. 1946 ఏప్రిల్ లో ఎలోనార్ రూజ్వెల్డ్ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో తాత్కాలిక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎలోనార్ రూజ్వెల్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు మాజీ అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్ సతీమణి. మానవ హక్కుల అంతర్జాతీయ బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ఆ బృందం సూచించింది. ఎలినార్ రూజ్వెల్డ్ అధ్యక్షతన 1947 జనవరిలో 18 మంది సభ్యులు గల నూతన మానవ హక్కుల కమిషన్ మొదటిసారిగా సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను పరిశీలించింది. మానవ హక్కుల అభివృద్ధికి తోడ్పడే అంతర్జాతీయ బిల్లు కోసం ముసాయిదా రూపకల్పనను ప్రారంభించింది. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను స్వీకరించింది. 

మానవ హక్కులు అంటే....

   ఎలాంటి వివక్ష, అసమానత, వ్యత్యాసం లేకుండా, సమానత్వంతో ఉన్నతమైన గౌరవాన్ని ప్రతి వ్యక్తికీ శాశ్వతంగా కల్పించాలి. 1789 లో రుపొందించిన "ద డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సిటిజన్" ప్రేరణతో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన వచనాన్ని 1948 లో పునః రూపొందించారు. ఎలినార్ రూజ్వెల్డ్ అధ్యక్షత వహించిన 18 సభ్యులతో కూడిన కమిటీ ముసాయిదా బిల్లు రూపొందించింది. కెనడాకి  చెందిన జాన్ పీటర్స్ హంఫ్రీ ఈ బిల్లును స్వదస్తూరితో రాశారు. ఫ్రాన్స్ కి చెందిన రెనే  క్యాస్సినే తుది మెరుగులు దిద్దారు. పారిస్ లో 1948 డిసెంబర్ 10 న జరిగిన ఐక్యరాజ్య సమితి మూడో జనరల్ అసెంబ్లీ సమావేశంలో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఆమోదం పొందింది. ఐక్యరాజ్య సమితిలో 56 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక దేశం కూడా ఓటు వేయలేదు. సోవియట్ యూనియన్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా దేశాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రపంచ చరిత్రలో ఒక మైలురాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి వేర్వేరు రంగాలలో నిష్టాతులు, న్యాయకోవిదులు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన ప్రతినిధులు దీన్ని రూపొందించారు.

హంస మెహతా 

   1947 - 48 లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి కమిషన్ లో జరిగిన సమావేశానికి భారతదేశం తరపున హాజరైన మహిళా ప్రతినిధి హంస మెహతా. ఆమె భారత్ లోనూ, విదేశాల్లోనూ మహిళల హక్కుల కోసం పోరాడారు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన రూపకల్పనలోనూ హంస మెహతా పాలుపంచుకున్నారు.




  • ఆర్టికల్ 1:  పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం ఎవరైనా పొందుతారు. మరొకరి స్వేచ్ఛ, సమానత్వానికి భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించకూడదు. స్నేహపూర్వకంగా మెలగాలి.
  • ఆర్టికల్ 2: కుల,  మత,  వర్ణ,  వయో, లింగ,  బీద - గొప్ప తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి మానవ హక్కులు లభిస్తాయి. తామున్న దేశం స్వతంత్రమైనదా, మరొకరి పాలనలో ఉన్నదా అనే తేడా లేకుండా ప్రపంచంలో పౌరులందరూ ఈ మానవ హక్కులకు అర్హులే.
  • ఆర్టికల్ 3: నివసించే హక్కు, స్వేచ్ఛా జీవనం, భద్రతతో కూడిన వాతావరణం లో జీవించే హక్కులు పౌరులు అందరికీ ఉంటాయి. 
  • ఆర్టికల్ 4: మరో వ్యక్తిని బానిస/దాసీ/దాసుడిగా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదు.
  • ఆర్టికల్ 5: మరొకరిని హింసించే హక్కు ఎవరికీ లేదు.
  • ఆర్టికల్ 6: చట్టబద్ధంగా ప్రతిచోటా అందరూ ఒకే విధమైన రక్షణ పొందగలగాలి.
  • ఆర్టికల్ 7: చట్టం దృష్టిలో అందరూ సమానమే. అందరికీ ఒకే విధమైన న్యాయం, చట్టం వర్తిస్తాయి.
  • ఆర్టికల్ 8: దేశం మంజూరు చేసిన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు చట్టపరమైన సహాయం పొందే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంటుంది.
  • ఆర్టికల్ 9: అకారణంగా కారాగారంలో ఉంచే హక్కు ఎవరికీ లేదు. ఏ పౌరుడిని అన్యాయంగా దేశం నుంచి బహిష్కరించే హక్కు కూడా ఎవరికీ లేదు.
  • ఆర్టికల్ 10: నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తిని ప్రజల ముందు విచారణ చేయాలి. ఇతర వ్యక్తులపై చేసే విచారణ, వారిని ప్రభావితం చేయకూడదు, వారు ప్రలోభానికి లోనుకాకూడదు.
  • ఆర్టికల్ 11: అపరాధిగా నిరూపితమయ్యే వరకు ప్రతి ముద్దాయిని అమాయకుడిగానే పరిగణించాలి. నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రతీ వ్యక్తికి తనకు తానుగా వాదించుకొనే హక్కు ఉంటుంది. తాను చేయని నేరానికి శిక్షించే హక్కు ఎవరికీ లేదు.
  • ఆర్టికల్ 12: ఒక వ్యక్తికి సమాజంలో ఉన్న గౌరవం, పేరు, ప్రతిష్టలకు మరొకరు హాని తలపెట్టినప్పుడు వాటి నుంచి కాపాడుకొనే హక్కు తనకు ఉంటుంది. అనుమతి లేకుండా ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే హక్కు మరొకరికి లేదు. ఒక వ్యక్తి లెటర్ బాక్స్ నుంచి ఉత్తరాలు తెరచి చదివే హక్కు కూడా లేదు. ఒక వ్యక్తి లేదా వారి కుంటుంబ సభ్యులను కారణం లేకుండా బాధపెట్టే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి విషయాల్లో భద్రత పొందే హక్కు, తమని తాము కాపాడుకునే హక్కును ప్రతి  ఒక్కరూ కలిగి ఉంటారు.
  • ఆర్టికల్ 13: ప్రతి పౌరుడు తాను నివసించే దేశంలో, నిషేధించిన ప్రాంతాలు మినహా స్వేచ్ఛగా ఎక్కడైనా ఎప్పుడైనా తిరిగే హక్కు కలిగి ఉంటారు. ప్రతీ  పౌరుడికి తమ దేశం నుంచి మరొక దేశం వెళ్లే హక్కుంది. పరాయి దేశంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా స్వదేశం చేరుకొనే హక్కు కలిగి ఉంటారు.
  • ఆర్టికల్ 14: ఒక దేశంలో ఎవరితోనైనా బాధలకు గురి అవుతున్నప్పుడు, మరో దేశానికి వెళ్లి తమని తాము రక్షించుకునే హక్కు ప్రతి  పౌరుడికి ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరినైనా హత్య చెడినా, మరో ఘోరమైన నేరానికి పాల్పడిన,  నేరారోపణలు ఎదుర్కొంటున్నా ఈ హక్కును కోల్పోతారు.
  • ఆర్టికల్ 15: ప్రతి ఒక్కరు ఒక దేశానికి చెందే హక్కు కలిగి ఉంటారు.అకారణంగా ఎవరు ఈ హక్కుని కాలరాచి, నిరోధించలేరు.
  • ఆర్టికల్ 16: చట్టపరమైన వయస్సు నిండిన తరవాత ప్రతి వ్యక్తి వివాహం చేసుకోడానికి, తన కుటుంబాన్ని పెంపొందించుకోడానికి అర్హులు. ఒక వ్యక్తి చర్మ రంగు, కులం, మతం  వివాహం చేసుకోడానికి అడ్డంకిగా ఉండకూడదు. వివాహానంతరం స్త్రీ, పురుషుడు సమానహక్కులను కలిగి ఉంటారు. స్త్రీ, పురుషుడు దురదృష్టకరమైన పరిస్థితుల్లో వివాహబంధాన్ని తెంచుకొని విడిపోయినప్పుడు కూడా సమానమైన హక్కులను కలిగి ఉంటారు. వివాహం చేసుకోవాలని ఏ ఒక్కరిపై ఒత్తిడి చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రతి దేశంలోని ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని కాపాడాలి.
  • ఆర్టికల్ 17: ప్రతి ఒక్కరూ ఆ దేశ చట్టాలనుసారంగా, న్యాయపరంగా తాము కోరుకొన్న వస్తువులు కొనుక్కొని సొంతం చేసుకోవడానికి హక్కు ఉంది.
  • ఆర్టికల్ 18: ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని మార్చుకొనే హక్కు ఉంది. ప్రతి ఒక్కరు తమ మతానికి సంబంధించిన పూజలు, హోమాలు, వ్రతాలు, భజనలు, ప్తార్థనలు స్వేచ్ఛగా చేసుకొనే హక్కు కలిగి ఉన్నారు.
  • ఆర్టికల్ 19: ప్రతి ఒక్కరూ వాక్ స్వాతంత్ర్యం కలిగి ఉంటారు.తమకు ఇష్టమైన విధంగా ఆలోచించే, వాటిని ఇతరులతో పంచుకునే, తమకు తోచినది మాట్లాడే హక్కు ఉంటుంది. తమ ఇష్టా అయిష్టాలను చెప్పవచ్చు. అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఇతర దేశాల్లోని ప్రజలతో మాట్లాడవచ్చు.పరస్పర అభిప్రాయాలు పంచుకుని, చర్చించే హక్కు కలిగి ఉంటారు.
  • ఆర్టికల్ 20: ప్రతి ఒక్కరు శాంతియుత సమావేశాలు నిర్వహించుకునే హక్కు కలిగి ఉంటారు. ఏ వ్యక్తినీ  ఒక సమూహానికి చెంది ఉండాలని, ఒక బృందంలో చేరాలని బలవంతం చేయడం మాత్రం తప్పు.
  • ఆర్టికల్ 21: ఆయా దేశ రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనడానికి ప్రతీ పౌరుడికి హక్కు ఉంది.తమ అభిప్రాయాలకి  సరిపోయే రాజకీయ నాయకులను ఎంచుకునే హక్కు ఉంది. దేశంలో జరిగే ప్రతీ పంచాయతీ, మున్సిపల్, శాసనసభ ఎన్నికలలో పాల్గొనే హక్కు ఆయా భౌగోళిక ప్రాంతవాసులు అందరికి ఉంది. ప్రభుత్వాలు నిర్దేశించిన కాలానుసారం, క్రమం తప్పకుండా  ఎన్నికలు నిర్వహించాలి. ఏ అభ్యర్థి లేదా ఏ పార్టీకి ఓటు వేశారో రహస్యంగా ఉంచాలి. చట్టపరమైన వయస్సు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది.
  • ఆర్టికల్ 22: సాంస్కృతిక,  సామాజిక, సంక్షేమ ప్రయోజనాలు సమాజంలోని అందరికీ  సమానంగా ఉండాలి.
  • ఆర్టికల్ 23: ప్రతి ఒక్కరికి పని చేసే హక్కు, తనకు నచ్చిన పని ఎంచుకొనే హక్కు ఉంది. ప్రతి ఒక్కరు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడే జీతం పొందే హక్కు ఉంది. స్త్రీ, పురుషులు ఒకే పనిని చేస్తున్నప్పుడు, ఎలాంటి అసమానతలు లేకుండా వారికి సమాన జీతం ఉండాలి. పనిచేసే కార్మికులు తమ ఆసక్తులను కాపాడుకొనేందుకు, తమకు జరిగే అన్యాయాలను ప్రతిఘటించేందుకు ఐక్యంగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకొనే హక్కు ఉంది.
  • ఆర్టికల్ 24: పని గంటలు సమంజసంగా ఉండాలి. ప్రతి ఒక్కరు విశ్రాంతి తీసుకొనే హక్కు కలిగి ఉంటారు. వేతన చెల్లింపుతో కూడిన సెలవుదినాలు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.
  • ఆర్టికల్ 25: ఒక బిడ్డ తల్లి అవివాహిత,  వివాహిత అన్న విషయంతో సంబంధం లేకుండా ప్రతి బాలుడు, బాలిక సమానమైన హక్కులు కలిగి ఉంటారు. గర్భిణులు, గర్భస్థ శిశువులకు ప్రత్యేక శ్రద్ధ,  సహాయం పొందే హక్కు ఉంది. ఏ ఒక్క వ్యక్తి అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు తనకి తన కుటుంబానికి అవసరమయ్యే వసతులు, ఆరోగ్య సేవలు పొందే హక్కు ఉంది. ఆహరం, దుస్తులు, గృహ, వైద్య సంరక్షణ అవసరమైన సామజిక హక్కులు కలిగి ఉంటారు. నిరుద్యోగం, అనారోగ్యం, వైకల్యం, వైధవ్యం వృద్ధాప్యం లేదా తన నియంత్రణకు మించిన పరిస్థితుల్లో జీవనోపాధికి భద్రత, సామాజిక రక్షణను పొందే హక్కు ఉంది.
  • ఆర్టికల్ 26: ప్రతి ఒక్కరూ విద్యా హక్కు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లగలిగే హక్కు కలిగి ఉంటారు. ప్రాథమిక విద్యను తప్పనిసరిగా అందరికీ కలుగచేయాలి. ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా లభ్యం కావాలి. సాంకేతిక,  వృత్తిపరమైన విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి. ఉన్నత విద్య అందరికీ ప్రతిభను బట్టి అందుబాటులో ఉంచాలి. మానవ వ్యక్తిత్వం, వికాసం పూర్తి అభివృద్ధికి, మానవ హక్కులు, మౌలిక స్వేచ్ఛలకు సంబంధించి బలపరిచేలా విద్యను నిర్దేశించాలి. అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలు, మిత్రత్వం, అన్ని జాతి, మత,  కులాల, ఇతర సమూహాల మధ్య అవగాహన,  సహనం, స్నేహాన్ని ప్రోత్సహించి శాంతి నిర్వహణ కార్యకలాపాలను మరింతగా పెంచేందుకు తోడ్పడేలా విద్యను రూపొందించాలి. తమ పిల్లలకు ఏ అంశం ఎంచుకోవాలో, ఏ విద్యాబుద్ధులు చెప్పించాలో ఎంపిక చేసుకొనే, నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకు కల్పించారు.
  • ఆర్టికల్ 27: ప్రతి ఒక్కరికీ సామాజిక సాంస్కృతిక జీవితంలో పాల్గొనే, కళలను ఆస్వాదించే, శాస్త్రీయ అభివృద్ధి అలాగే దాని ప్రయోజనాలను ఉచితంగా పంచుకొనే హక్కు ఉంది. ప్రతి కళాకారుడు, రచయిత, శాస్త్రవేత్త తన స్వీయరచన,  శాస్త్రీయ,  సంగీత,  సాహిత్య, కళాత్మక ఉత్పాదన,  ప్రదర్శన,  గ్రంథం మీద నైతిక, భౌతిక ప్రయోజనాల రక్షణకు ప్రతి ఒక్కరూ హక్కు కలిగి ఉన్నారు.
  • ఆర్టికల్ 28: మానవ హక్కుల డిక్లరేషన్ లో పేర్కొన్న హక్కులు, స్వేచ్ఛలను పూర్తిగా గౌరవించాలి. అందుకు స్థానిక, అంతర్జాతీయ చట్టాలు ఉండాలి.
  • ఆర్టికల్ 29: ప్రతి పౌరుడికి సమాజాభివృద్ధికి, తద్వారా వ్యక్తిగత వికాసానికి తోడ్పడే విధులున్నాయి. ప్రతి స్థానిక చట్టం మానవ హక్కులకు రక్షణ కల్పించాలి. తద్వారా ప్రతి ఒక్కరూ ఇతరులను గౌరవించటానికి, గౌరవం అందుకోడానికి దోహదపడుతుంది.
  • ఆర్టికల్ 30: ప్రపంచంలోని ఏ భూభాగంలో కానీ ఏ దేశం, రాజ్యం, సమాజం కానీ, ఏ వ్యక్తి కానీ ఈ మానవ హక్కులను ఉల్లంఘించరాదు. కించపరచకూడదు. అశ్రద్ధ చేయకూడదు, తేలికగా తీసుకోరాదు, అపహాస్యం చేయరాదు, మరొకరి హక్కులు, స్వేచ్చకు భంగం తలపెట్టరాదు.

Comments